అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

న్యూజెర్సీలో భారతీయ దంపతుల అనుమానాస్పద మృతి

మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాకు చెందిన 32ఏళ్ల బాలాజీ రుద్రావర్‌ ఐటీలో ఉద్యోగం చేస్తూ 2015 ఆగస్టులో ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, మళ్ళీ బాలాజీ భార్య ఆర్తి(30) 7 నెలల గర్భిణి. బుధవారం బాలాజీ కుమార్తె న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల తన ఇంటి బాల్కనీలో ఏడుస్తూ కన్పించడంతో చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో డోర్‌ బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా బాలాజీ, ఆయన భార్య లివింగ్‌ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలాజీ తన భార్యను పొడిచి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. కానీ పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ మృతికి గల కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న బాలాజీ కుటుంబానికి సమాచారమివ్వగా ‘‘నా కొడుకు, కోడలు చాలా ఆనందంగా ఉండేవారు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎలా చనిపోయారో అర్థం కావట్లేదు’’ అని బాలాజీ తండ్రి భరత్‌ రుద్రావర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి బాలాజీ స్నేహితుడి సంరక్షణలో ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.