ఈరోజు ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు
కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి విశాఖ నగరపాలక సంస్థ వరకు పాదయాత్ర నిర్వహించారు. దీనిలో భాగంగా తెల్లవారుజామునే కూర్మన్నపాలెం జంక్షన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి కాగడాలతో పాదయాత్ర చేపట్టారు. వీరికి మద్దతుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక నియోజకవర్గం నుంచి నగరపాలక సంస్థ వరకు పాదయాత్ర నిర్వహించినట్లు చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్‌ లో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ సెక్టారులోనే ఉండాలని, ప్రైవేటు పరం అయితే కార్మికుల కుటుంబాలు రోడ్డునపడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.