గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించింది మొదలు లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఆగిపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొంతమంది కూరగాయల దుకాణాలు, చాయ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న, కూలీలుగా మారిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరిలో స్కూళ్లు ప్రారంభం అవ్వడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కొద్ది రోజులకే మళ్లీ పాఠశాలలను ప్రభుత్వం మూసేయాలని ఆదేశించింది.దీంతో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికి సాయం అందించేలా నిర్ణయం తీసుకుంది. పాఠశాలలను మళ్లీ తెరిచే వరకూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రభుత్వ సాయానికి అర్హులైనవారు తమ బ్యాంకు ఖాతా సహా ఇతర వివరాలను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అయితే అర్హులను ఏ విధంగా గుర్తించబోతున్నారో మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ‘‘లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగాలు కోల్పోయినవారు కూడా ప్రభుత్వ సాయానికి అర్హులే.

లాక్‌డౌన్ విధించడానికి ముందు కాలం నాటి పేస్లిప్‌లతో సిబ్బంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీఈఓ, ఎంఈఓ, కలెక్టర్ వీటిని పరిశీలించి అర్హుల జాబితాను ఖరారు చేస్తారు’’ అని, ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన హాస్టళ్లలో పనిచేసే వార్డెన్‌లు, ఇతర సిబ్బందికి కూడా ప్రభుత్వ సాయం అందుతుందని గంగుల కమలాకర్ చెప్పారు. వేతనాలు అందని ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని మాత్రమే ప్రత్యేకంగా గుర్తించి సాయం అందిస్తారా? అనే ప్రశ్నకు అలాంటి వడపోత ఏమీ ఉండదని మంత్రి సమాధానం ఇచ్చారు.