వార్తలు (News)

తెలంగాణలో వర్షబీభత్సం.. గత 120 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా??

కుండపోత వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వర్షాలు, వరదలకు ఆరుగురు మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు.

తెలంగాణలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పాత రికార్డులన్నీ గల్లంతై గత 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లా నడికూడలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ (4 గంటల వ్యవధిలో) అత్యధికంగా 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

వరంగల్‌- కరీంనగర్‌ జాతీయ రహదారిపై, వరంగల్‌-ములుగు జాతీయ రహదారిపై కటాక్షపూర్‌ చెరువు వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు, ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి-కరీంనగర్‌ మార్గంలో కమాన్‌పూర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప తూర్పు రోడ్డుకు గండి పడింది. రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ రహదారి తెగిపోయింది. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి వరద 34.5 అడుగులకు చేరింది. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నీట మునిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •