ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా అందులో 13 మంది మృతి చెందారు. గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వరుణ్‌ సింగ్‌ ఇండియన్‌ ఆర్మీలో విశేష సేవలందించారు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్‌ సింగ్‌ను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది. గతేడాది తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన తరుణంలో నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్‌ చేసారు.