తమిళనాడులో ఊటీ కొండల్లో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురుబకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయి తేజ(29) కూడా దుర్మరణం పాలయ్యారు. సాయితేజ రక్షణ శాఖలో లాన్స్‌ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా ఉన్న సాయితేజ ఈరోజు మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి చెందారు. సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

2013లో బెంగళూరు రెజిమెంట్‌ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్తూనే ఏడాది తర్వాత పారా కమాండో పరీక్షరాసి ఉత్తీర్ణుడయ్యారు. అనంతరం 11వ పారాలో లాన్స్‌ నాయక్‌ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాది క్రితం వరకు బెంగళూరులోని సిపాయిల శిక్షణా కేంద్రంలో శిక్షకుడిగా పనిచేశారు. ఇటీవలే సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా వచ్చారు. సాయితేజకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. ప్రస్తుతం సాయితేజ కుటుంబ సభ్యులు మదనపల్లిలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్నారు. నిన్న ఉదయం 8.45 గంటలకు సాయితేజ వీడియో కాల్‌ చేసి భార్య, కుమార్తె, కుమారుడితో మాట్లాడిన అనంతరం కొన్ని గంటల్లోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను కలచివేసింది. సాయితేజ మృతితో మదనపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

2012లో సిపాయిగా ఆర్మీలో చేరిన సాయితేజ.. మొదట జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహించారు. సైన్యంలో నిర్వహించే పారాట్రూపర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కఠిన శిక్షణ తీసుకున్న అనంతరం దేశంలో అత్యంత దృఢమైన, శక్తి సామర్ధ్యాలు కలిగిన వారే ఈ పారట్రూపర్స్. శత్రు దేశాల్లోకి వెళ్లి దాడి చేయడంలో వీరు సిద్ధహస్తులు, పాకిస్తాన్‌పై మొదటి సర్జికల్ స్ట్రైక్ చేసింది పారాట్రుపార్సే. సాయితేజ పార్థివదేహం చూడడానికి కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి బయల్దేరారు.

పారాట్రూపర్స్ శిక్షణలో రాటుతేలిన సాయితేజ కొంతకాలం పారాట్రూపర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆయన శక్తిసామర్ధ్యాలనూ గుర్తించిన రావత్ తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేర్చుకున్నారు. రావత్, ఆయను బాగా అబిమానించేవారని స్నేహితులు చెబుతున్నారు. సాయితేజ ప్రోత్సాహంతో తన తమ్ముడు మహేష్ బాబు కూడా సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అతడు సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు. సాయితేజ మరణం ఒక్క చిత్తూరు జిల్లా వాసులనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను బాధలో ముంచేసింది. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సాయితేజకు దేశ ప్రజలు ఘననివాళి అర్పించాలి.