ఓటీఎస్‌ పథకం, గృహ నిర్మాణంపై సీఎం వైయస్‌.జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఓటీఎస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంటూనే ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందం అని అన్నారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని… రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామన్నారు. వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నామని ప్రకటన చేశారు. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి, వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలని పిలుపు నిచ్చారు.

ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పరిశీలించలేదని వెల్లడించారు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారనే విషయం ఇవాళ మాట్లాడుతున్నవారు మరి అప్పుడు ఎందుకు కట్టించున్నారు? అని నిలదీశారు.

అయితే అసలు, వడ్డీ కడితేనే బి-ఫారం పట్టా ఇచ్చేవారని, మరి ఇప్పుడు ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని, అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుందని పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం!