సిమెంటుకు గిరాకీ భారీగా తగ్గిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్‌ బ్రాండ్‌ సిమెంటు ధర రూ.400 దిగువకు; కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు.

కోత విధించిన కంపెనీల్లో అంబుజా సిమెంట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, శ్రీ సిమెంట్‌, ఓరియంట్‌ సిమెంట్‌, సాగర్‌ సిమెంట్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, చెట్టినాడ్‌ సిమెంట్‌, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, దాల్మియా భారత్‌,హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా మొదలైన కంపెనీ లు ఉన్నాయి.

నవంబరు చివర్లో ధరలను పెంచాలని సిమెంటు కంపెనీలు భావించినప్పటికీ పలు చోట్ల గిరాకీ తగ్గడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలకు తోడు, ద్రవ్యలభ్యత సమస్యలతో గిరాకీ మరింతగా తగ్గిందని డీలర్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నవంబరు చివరి వారం నుంచి డిసెంబరు తొలి వారం వరకు కురిసిన భారీ వర్షాలతో పాటు హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్లు అధిక స్థాయిలో ఉండడంతో కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతూ బిల్డర్ల వద్ద డబ్బులు లేక సిమెంటు వినియోగం సైతం తగ్గింది. దీంతోనే ధరల తగ్గింపు సంభవించింది.