కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, అటు ప్రార్ధనా మందిరాలలో కూడా కోవిడ్ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి, భౌతిక దూరం వంటి నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కోవిడ్ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి అనంతరం పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు వైద్య నిపుణులను సంప్రదించి ఇవ్వాల్సిన మందులను కోవిడ్ హోం కిట్స్‌లో జత చేయాలని సూచించారు.

ఇంకా చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలన్న సీఎం.. అవసరం మేరకు వాటిని కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలని, అటు 104 కాల్ సెంటర్‌కు ఎవరు ఫోన్ చేసినా 24/7 స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గానికి అన్ని సౌకర్యాలతో కూడిన ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు.

రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను ప్రజలందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని, దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.