కరోనా వలన తెలంగాణలో గతేడాది ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ను నిర్వహించకుండానే ఆయా విద్యార్థులను సెకండియర్ లోకి ప్రభుత్వమే ప్రమోట్ చేసింది. కానీ ఆయా విద్యార్థులకు అక్టోబర్ నెలలో లో పరీక్షలను నిర్వహించింది. కానీ ఆ పరీక్షల ఫలితాల్లో కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు వివిధ సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫెయిల్ కావడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు కూడా పాల్పడడంతో ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలన్న డిమాండ్లు ఆయా వర్గాల నుంచి వచ్చాయి. దీంతో స్పందించిన కేసీఆర్ సర్కార్ ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనికి తోడు ఇంకా ఎక్కువగా మార్కులు సాధించగలమని నమ్మకం ఉన్న విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ సైతం రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలను ఆ సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ http://tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి మార్క్స్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ సూచించింది. మెమోలు ఈ నెల 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని బోర్డ్ వెల్లడించింది.

కొందరు విద్యార్థులు ఫెయిల్ కావడంతో రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ విద్యార్థులంతా ప్రభుత్వం కేటాయించిన కనీస మార్కులకు సంతృప్తి చెందితే రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకునే అవకాశాన్ని కల్పించింది ఇంటర్ బోర్డ్. విద్యార్థులు ఈ నెల 7 తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం చేసుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకునే అవకాశాన్ని కల్పించినట్లు బోర్డు తెలిపింది. దరఖాస్తును వెనక్కి తీసుకున్న అభ్యర్థులు తాము చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో తిరిగి పొందవచ్చని బోర్డు స్పష్టం చేసింది.