ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేసే ప్రక్రియ పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ బి.గోపి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1493 మంది ఉద్యోగులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వగా గురువారం 466 మంది విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగులు శుక్రవారం విధుల్లో చేరతారని వెల్లడించారు.
వివిధ జిల్లాల నుంచి వరంగల్‌కు కేటాయించబడిన ఉపాధ్యాయులను పాఠశాలలకు కేటాయిస్తూ ఎట్టకేలకు గురువారం జిల్లా కలెక్టర్ డా.గోపి, విద్యాశాఖ అధికారి డి.వాసంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 36 కేటగిరిల్లో 1,041 మంది ఉపాధ్యాయులు, 13 మంది బోధనేతర సిబ్బందికి చరవాణుల ద్వారా నియామక ఉత్తర్వుల సమాచారం పంపించినట్లు చెప్పారు.
మొబైల్ నంబర్‌కు పంపిన ఉత్తర్వులనే అధికారిక ఉత్తర్వులుగా పరిగణించాలని, ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ కాకుండానే కొత్తగా కేటాయించిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు శుక్రవారం జాయిన్ కావాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించాలని, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి నిబంధనల మేరకు పారదర్శకంగా చేపట్టామని డీఈవో తెలిపారు. కలెక్టర్ డా.గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్ సమక్షంలో బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించమని వాసంతి వెల్లడించారు.