తెలంగాణ లో తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న పొగ మంచుతో హైవేలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలి కూడా విపరీతంగా పెరుగుతుండడంతో వెన్నులో వణుకు పుడుతుంది. తెలంగాణ లో ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణం చేసినట్లుగా పగలు కూడా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు.

జనగాం జిల్లాలో తెల్లవారు జాము నుండి ఈ చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయి పడిపోతున్నాయి. పొగమంచుతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మంచు దుప్పటితో కప్పేస్తుంది. వాహనదారులు రహదారి కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులపై మంచు పూర్తిగా కమ్మేస్తుంది. అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు రక్షణ కవచాలు లేకుండా బయటికి రాని పరిస్థితి ఉందంటున్నారు. చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు స్థానికులు చలిమంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నామంటున్నారు.