ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. మొత్తం 3,249 స్థానాల్లో ఇప్పటివరకు 2,993 స్థానాల ఫలితాలు వచ్చాయి. వీటిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,429 స్థానాలను కైవసం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు 465 స్థానాల్లో విజయం సాధించారు. జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు 36 మంది, ఇతరులు 63 మంది గెలుపొందారు.
కాగా, పంచాయతీ ఎన్నికలపై పార్టీలు ఆసక్తికర లెక్కలు చెబుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తామే ఎక్కువ సీట్లు గెలిచామని సంబరాలు చేసుకుంటున్నాయి. తాము 90 శాతం సీట్లు గెలిచామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు చేసుకున్నాయి. ఇక, తెలుగేదశం పార్టీ కూడా తామే మెజారిటీ స్థానాలు గెలుచుకున్నామని చెబుతూ సంబరాలు చేసుకోవడం గమనార్హం. రెండు పార్టీలూ తాము గెలిచిన స్థానాలు ఇవీ అంటూ అంకెలను ప్రదర్శించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు కాబట్టి, ఏ పార్టీకి ఆ పార్టీ తామే ఎక్కువ సీట్లు గెలిచామని చెప్పుకుంటున్నాయి.