విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కీల‌క విష‌యాలు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స‌మాధానం చెప్పారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో అనే సంస్థ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి 2019 అక్టోబ‌రులోనే పోస్కో సంస్థ‌, ఆర్ఐఎస్ఎల్ మ‌ధ్య ఒప్పందం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు.

పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టికే జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన స‌గం భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తుంద‌ని, మిగ‌తా స‌గం భూముల‌ను గ్రీన్‌ఫీల్డ్‌కు కేటాయించ‌నున్న‌ట్లు తెలిపారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో సంస్థ‌కు 50 శాతం వాటా ఉంటుంద‌ని తెలిపారు.

ఇప్ప‌టికే పోస్కో సంస్థ బృందం 2019 జులై, 2019 సెప్టెంబ‌ర్‌, 2020లో మూడుసార్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప‌రిశీలించింద‌ని కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఒప్పందం ర‌హ‌స్యంగా ఉంద‌డం గ‌మ‌నార్హం. సౌత్ కొరియాకు చెందిన కంపెనీ పోస్కో. పోస్కో అంటే పొహాంగ్ ఐర‌న్ ఆండ్ స్టీల్ కంపెనీ అని అర్థం. ఇప్ప‌టికే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోస్కో సంస్థ‌కు అప్ప‌గించ‌నున్నార‌నే ప్ర‌చారం ఉండ‌గా, ఇది వాస్త‌వ‌మేన‌ని కేంద్ర‌మంత్రి క్లారిటీ ఇచ్చారు.