హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంబా జిల్లాలో బుధవారం ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
తీసా సబ్‌ డివిజన్‌ వద్ద తీసా నుంచి బయలుదేరిన బస్సు చంబాకు వస్తున్నప్పుడు చంబా-ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చంబా హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు చనిపోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పేర్కొన్నారు. చంబా బస్సు దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ విచారం వ్యక్తం చేసింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్, చురా ఎమ్మెల్యే హన్స్‌రాజ్ సహా ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.20 వేలు, గాయపడ్డవారికి రూ.5వేలు అందజేసి, మరణించిన వారి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే గాయపడ్డ వారికి కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.