పశ్చిమ బెంగాల్ లో రాత్రికి రాత్రే రాష్ట్ర డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చివేసి కొత్త అధికారులను నియమించింది. కానీ సాక్ష్యాత్తూ తనకే భద్రత కరువైపోయిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి తనపై దాడి జరిగినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. కానీ బీజేపీ మాత్రం దీన్నొక డ్రామాగా కొట్టిపారేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ఇది అసెంబ్లీ ఎన్నికల వేళ కావడంతో దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది.

నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార సమయంలో ఆమె కారు ఎక్కుతుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన నలుగురైదుగురు వ్యక్తులు తనను నెట్టివేశారని మమత ఆరోపించారు. దీని వెనుక ఎదో కుట్ర దాగి ఉందని, ఆ సమయంలో తన చుట్టూ భద్రతా సిబ్బంది కూడా లేరని సీఎం చెప్పారు.

దీదీపై దాడి.. గాయాలు.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. బీజేపీతో సవాళ్ల నేపథ్యంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి బుధవారం ఉదయం వివిధ దేవాలయాల్లో పూజల అనంతరం హల్దియాలో నామినేషన్‌ దాఖలు చేశారు. మరో రెండు రోజులు ఇక్కడే పర్యటన చేయవలసిన ఆమె మీద రాత్రి సమయంలో దాడి చోటుచేసుకుంది. దీంతో ఆమె పర్యటన అర్ధంతరంగా ముగిసింది. దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని సీఎం తెలిపారు. గాయపడిన మమతను పార్టీ శ్రేణులు కోల్‌కతాకు తరలించాయి.

రాష్ట్ర డీజీపీ వీరేంద్రను మంగళవారం రాత్రికిరాత్రే బదిలీ చేసింది. ఆయనకు పోస్టు ఇవ్వకుండా, కొత్త డీజీపీగా 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పి.నీరజ్‌ నయన్‌ను నియమించింది. డీజీపీ మార్పు వెనుక కేంద్రం ఒత్తిడి ఉండొచ్చని టీఎంసీ ఆరోపించగా, కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రిపై దాడి జరగడం సంచలనం రేపుతున్నది. అయితే, దీదీపై దాడి జరగడం అనేది కల్పితమని, అది మమతా ఆడుతున్న నాటకమని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల్లో పోటీకి భయపడి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.