శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి ముందు ఆలయంలోని అలంకార మండపములో స్వామి అమ్మవార్లకు ఆశీనులుగావించి ఆలయ వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ధూపదీప కర్పూర హారతులతో నీరాజనాలు పట్టారు. మంగళవాయిద్యాలు నడుమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, విన్యాసాల నడుమ ఊరేగింపు కొనసాగింది.

అఖండమైన జ్ఞానానికి ప్రతీకైన హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వగా, జ్ఞానశక్తి అయిన అమ్మవారు చిలుక వాహనంపై కొలువుదీరి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. హంస ఎలా అయితే సద్గుణమైన పాలను స్వీకరించి నీళ్లను విడిచిపెడుతుందో అలాగే హంసవాహనాధీశుడిని దర్శించుకున్న వారు కష్టాల నుంచి విముక్తి పొంది శాంతికలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. దీంతో భక్తులు చతుర్ముఖ మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకుని, కర్పూర నీరాజనాలు భక్తిపూర్వకంగా సమర్పించుకుని, స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పునీతులయ్యారు.