విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఇప్పటికే చాలామంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా తమ మద్దతు పలికారు. ఉక్కు సంకల్పంతో విశాఖ ప్లాంటును కాపాడుకుందామంటూ ట్వీట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు. ఉద్యమం జరిగే రోజుల్లో తాను కూడా బ్రష్‌ చేతబట్టి గోడలపై విశాఖ ఉక్కు సాధిస్తామంటూ నినాదాలు రాశామని గుర్తు చేసుకున్నారు. తాను నరసాపురం కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమం జరిగిందని, ఆ నాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతున్నాయని తెలిపారు.