కోవిడ్ కి విరుగుడుగా కొవాగ్జిన్ టీకాను ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేశారు. దీనిపై క్లినికల్ పరీక్షలు నిర్వహించగా ‘కొవాగ్జిన్‌’ టీకా సమర్థత కనబరచడంతో పాటు, దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఎదురు కాలేదని రెండో దశ (ఫేజ్‌-2) క్లినికల్‌ పరీక్షల్లో నిర్థారణ అయినట్లు వైద్య శాస్త్ర పత్రిక ‘ద లాన్సెట్‌’ వివరించింది. దీనిపై విశ్లేషణ చేస్తూ పరిశోధనా వ్యాసాన్ని ఈ పత్రిక ప్రచురించింది.

దీనిపై రెండో దశ పరీక్షలను మనదేశంలోని 9 ప్రదేశాల్లో 12- 65 ఏళ్ల వాలంటీర్లపై నిర్వహించగా, టీకా తీసుకున్న వారిలో కొవిడ్‌-19ను ఎదిరించడానికి అనువుగా రోగ నిరోధక శక్తి (యాంటీ-బాడీస్‌) ఏర్పడిందని, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని ఇందులో వివరించింది. కొవాగ్జిన్‌ టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు సంబంధించి మొదటి మధ్యంతర ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. దీని ప్రకారం ఈ టీకా 81% ప్రభావశీలత కలిగిఉన్నట్లు ఈ కంపెనీ పేర్కొంది.