సాధారణంగా అమెరికాలో ఉద్యోగం ఆధారంగా చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను కోరే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినవారికి హెచ్‌-4 వీసాలను అందిస్తుంటారు. బైడెన్‌ పాలనలో వాటిని అందించే విషయంలో ఆలస్యం జరుగుతోందని ‘సేవ్‌ హెచ్‌4ఈఏడీ’ నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌-4 వీసాలను కొన్ని వర్గాల వారికి జారీ చేసే విషయంలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటుండటంపై అక్కడి ప్రవాస భారతీయ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా వేళా సంఖ్యలో స్త్రీలు ఉపాధి పొందే అవకాశానికి దూరమవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దీనికి నిరసనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌లో ‘సేవ్‌ హెచ్‌4ఈఏడీ’ పేరుతో ర్యాలీ నిర్వహించారు.‘‘అమెరికా మా స్వస్థలం.

జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసించి కుటుంబాలను కూడా పోషించాం. నైపుణ్యమున్న చట్టబద్ధమైన వలసదారులుగా సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు చేయూతను అందించాం’’ అని కార్యక్రమ ప్రధాన నిర్వాహకురాలు ప్రతిమా జొగ్లేకర్‌ చెప్పారు. శ్వేతజాతేతర మహిళల జీవనోపాధిని దోచుకునే ఏకపక్ష విధానాలకు ముగింపు పలకడంపై బైడెన్‌ ప్రభుత్వం దృష్టిసారించాలని కార్యక్రమానికి హాజరైనవారు అభ్యర్థించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్లిష్ట బయోమెట్రిక్‌ విధానం కూడా ఈ జాప్యానికి ఒక కారణమని, వెంటనే బైడెన్‌ యంత్రాంగం దాన్ని రద్దు చేయాలని కోరారు. హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల కోసం ఒకేసారి దరఖాస్తు చేసినప్పుడు, వాటికి అనుమతులు కూడా ఏకకాలంలో మంజూరు చేయాలని అభ్యర్థించారు.