పెట్రోల్ ధరలు కొన్ని రోజులుగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి తరుణంలో కొందరు అక్రమాలకు పాల్పడడం బాధాకరం. తాజాగా రాజేంద్ర నగర్‌లో కల్తీ పెట్రోల్ కలకలం సృష్టిస్తుంది. పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో ఇప్పుడు పెట్రోల్‌లో నీళ్లను కలిపివేసి విక్రయిస్తున్నారు. రాజేంద్రనగర్ లో ఈ కల్తీ పెట్రోల్ కలకలం రేపింది. ఉప్పర్ పల్లిలోని బడే మియా పెట్రోల్ బంక్ లో బంకుకు వచ్చే వాహనదారులకు కల్తీ పెట్రోల్ నిర్వాహకులు విక్రయిస్తున్నారు. నీళ్లతో కలిపిన పెట్రోల్ పోయడంతో తమ వాహనాలు పాడై పోతున్నాయి అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపెట్రోల్ బంకు యజమానికి, వాహనదారులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

పెట్రోల్ బంక్ యజమాని దురుసుగా ప్రవర్తించడంతో వాహనదారులు వెంటనే బడే మియా పెట్రోల్ బంక్ యజమానిపై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. పోలీసులు పెట్రోల్ బంక్ కి వచ్చి కల్తీ పెట్రోల్‌ను తీసుకొని పరిశీలిస్తున్నారు.