విశాఖలో ఉక్కు ఉద్యమం జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే! దీనికి అన్నివైపుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ తరుణంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతామని, అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేలా ఉందని విమర్శించారు.

ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం.. మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు. రేపు బీహెచ్‌ఈఎల్‌ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం, అలాగే తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే వారు కూడా మాతో కలిసిరావాలి’’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు

‘‘తెలంగాణలోని బయ్యారంలో సెయిల్‌ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ, పోరాడి మరీ సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులందరికీ అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్‌ ఆనుమతితో వైజాగ్‌ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం అని తెలియచేసారు.