దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోందని అందరికి తెలిసిందే! ఇప్పటి దాకా 3,39,145 సెషన్లలో కలిపి 2.43(2,43,67,906) కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 71,30,098 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, 69,36,480 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ తొలి డోస్ తీసుకోగా, 38,90,257 మంది హెచ్‌సీడబ్ల్యూ, 4,73,422 మంది ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలకు రెండో డోస్‌ అందించారు.

అయితే గడిచిన 24 గంటల్లో 13.5 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది. కర్ణాటకకు చెందిన వయోవృద్ధురాలు జె. కామేశ్వరికి టీకా ఇవ్వడంతో దేశంలో 103 ఏళ్ల వయసులో వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళగా రికార్టు సృష్టించింది.

దేశంలో గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కరంగా మారాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,921 కొత్త కేసులు నమోడు కాగా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడులలో ఈ సంఖ్య అధికంగా ఉంది. దీంతో దేశంలో నమోదయిన కేసుల్లో 84 (83.76)శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆక్టివ్ కేసుల సంఖ్య 1.84 లక్షలకు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 9,927 కేసులు, కేరళలో 2,316, పంజాబ్‌లో 1,027 కొత్త కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గడిచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కరు కూడా కరోనా వల్ల మరణించలేదని అధికారులు తెలిపారు.