ఎన్నికలు (Elections) వార్తలు (News)

మున్సిపల్ ఎన్నికల పోరు – ఏపిలో షురూ

ఆంధ్ర ప్రదేశ్లో ఉదయం 7గంటలకె మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలయింది. ఇది
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవం కావడం వల్ల ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.

ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 12 కార్పోరేషన్లలో 671 డివిజన్లు ఉండగా, 89 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. దానివల్ల మిగతా 582 డివిజన్లలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 71 మున్సిపాలిటీల్లో 2,123 వార్డులు ఉంటే, 490 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా 1633 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పోరేషన్లు,మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2215 డివిజన్లు,వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 78 లక్షల 71 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా.ఈ ఎన్నికల ఫలితాలు రావాలంటే ఈ నెల 14న కౌంటింగ్ జరిగే వరకు వేచి చూడవలసిందే! అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.అటు ఏలూరు, చిలకలూరిపేట కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా కూడా ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఈసారి పోలింగ్ బ్యాలెట్ పద్దతిలో జరుగుతుండగా, ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాకో నోడల్‌ అధికారిని నియమించారు.పోలింగ్ కోసం మొత్తం 7,915 కేంద్రాలను ఏర్పాటు చేయాగా, ఇందులో 2,320 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 2,468 పోలింగ్ కేంద్రాలను సాధారణ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. విజయవాడలో 21, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక జాబితాలో ఉన్నాయి.

కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతీ ఓటరు ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా అధికారులు పోలింగ్‌ తీరును పర్యవేక్షించనున్నారు.ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం 48,723 మంది అధికారులు, సిబ్బందిని నియమించింది. ఇందుకోసం రూ.30కోట్లు నిధులు విడుదల చేసింది.

ఓటర్లు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి:
ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆ ఓటరు తాను ఏ అభ్యర్థికి ఓటేశానని పోలింగ్ కేంద్రంలో బహిరంగపరిచా పక్షంలో ఆ ఓటును రద్దు చేసే విచక్షణాధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అంతేకాదు,అతనిపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేయవచ్చు.పోలింగ్ కేంద్రంలో సెల్‌ఫోన్లు అనుమతించరు. ఒకవేళ ఎవరైనా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు దిగితే వారి ఓటు రద్దు చేస్తారు. రాజకీయ పార్టీల తరుపున పోలింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్లు తాము ఆ పరిధిలోని ఓటర్లా కాదా అన్నది అధికారులకు తెలియజేయాలి. అంధులు,దివ్యాంగులు కుటుంబ సభ్యులు లేదా తెలిసినవారి సహకారంతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒకవేళ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే పరిస్థితిలో లేనట్టయితే పోలింగ్ అధికారే నేరుగా వారి వద్దకు వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.