దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన ధీరావత్‌ రాజునాయక్‌ నల్గొండలోని ఓ సంస్థలో ఏజెంటుగా పనిచేస్తూ జీవిత భీమా పాలసీలపై అవగాహన పెంచుకున్నాడు. అతడికి సహకరించడానికి కంచి శివ, మందాడి సాయి సంపత్‌, దేవిరెడ్డి హారిక, వేముల కొండల్‌ అనే వ్యక్తులను మచ్చిక చేసుకున్నాడు. ఇక పేదరికం, దీర్ఘకాలిక రోగాలున్నవారిని ఎంపిక చేసుకుని వారి పేరుతో బీమా పాలసీలు చేయించి వారిని హతమార్చి బీమా సొమ్ము కొట్టేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు.

ఎస్పీ రంగనాథ్‌ మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. వీరు ఇంతవరకు రూ. 3.39 కోట్ల బీమా నిధులను స్వాహా చేశారని తెలిపారు. బీమా సంస్థలు, ఓ బ్యాంకు సిబ్బంది సహా దామరచర్ల మండలంలోని పలు తండాలకు చెందిన 17 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఈ ముఠా మొత్తం ఆరుగురిని హతమార్చినట్లు ఇప్పటికి వెల్లడైందని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు బీమా ఏజెంటు ధీరావత్‌ రాజునాయక్‌, అతడికి సహకరించిన కంచి శివ, మందాడి సాయి సంపత్‌, దేవిరెడ్డి హారిక, వేముల కొండల్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కేసు వివరాల ప్రకారం పదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా శూన్యపహడ్‌లో సఫావత్‌ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి ఆయన పేరిట ఓ ప్రైవేటు సంస్థలో బీమా చేయించి, ఆయన ప్రమాదవశాత్తు మరణించినట్లు పంచాయతీ కార్యదర్శి ద్వారా ధ్రువీకరణ తీసుకుని సక్రియా పేరుతో ఉన్న రూ. 1.4 లక్షలను క్లెయిమ్‌ చేసి విచారణకు వచ్చిన సంస్థ సిబ్బందికి రూ. 50 వేలు, నామినీగా ఉన్న సక్రియా భార్య మొగ్లీకి రూ. 30 వేలు ఇచ్చి మిగతా సొమ్ము తన సొంత ఖాతాకు మరలించారు. రాళ్లవాగు తండాకే చెందిన సపావత్‌ తుల్స్యా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన భార్య, కుమారులను ఒప్పించి ఆయన పేరుతో రూ. 60 లక్షలు బీమా చేయించారు. తుల్స్యా చనిపోయాక మృతదేహాన్ని మిర్యాలగూడకు తీసుకువచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ మిర్యాలగూడ గ్రామీణ ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించారు. ఇందులో తుల్స్యా కొడుకు రాజేశ్‌నే సాక్షిగా మార్చారు. అలాగే రూపావత్‌ దేవా (రూ. 12 లక్షలు), పరంగి సోమయ్య (రూ. 10 లక్షలు), ధీరావత్‌ లాల్‌సింగ్‌ (రూ. 23 లక్షలు), దైద హుస్సేన్‌ (రూ. 53 లక్షలు) అనే వారిని హతమార్చి బీమా సొమ్ము రూ. 1.59 కోట్లు కొల్లగొట్టారు. కొంత వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి మిగతాది తాను తీసుకునేవారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లి, తెనాలిలోనూ ఇదే నేరం చేద్దామని కొండ్రపోల్‌, బొల్లిగుట్టకు చెందిన మరో ఇద్దరి పేరుతో రూ. 50 లక్షలు, రూ. 10 లక్షలకు పాలసీలు కట్టి వారిని హత్య చేయించడానికి ప్రణాళిక వేసినా కూడా ఈలోపే పోలీసులు, వైద్యులకు అనుమానం వచ్చి రాజునాయక్‌ను అరెస్టు చేయడంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారని ఎస్పీ వెల్లడించారు. ఫిబ్రవరి చివరలో దేవిరెడి కోటిరెడ్డి అనే వ్యక్తి పేరిట రూ. 1.2 కోట్లు క్లెయిమ్‌ చేస్తూ రాజునాయక్‌ దొరికిపోవడంతో నిందితులు హత్యకు ముందే పాలసీదారు కుటుంబ సభ్యులతో ఒప్పందం రాసుకునేవారు. ఒకసారి ఇలాంటి ఒప్పందం గురించి ఆ వ్యక్తి బంధువులకు తెలిసి వివాదమైంది. దీంతో తండా పెద్దలకు రూ. 50 వేలు కట్టి బయటపడ్డారు.

ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలోను ఏడెనిమిదేళ్లుగా ఎక్కడ హత్య చేసినా మిర్యాలగూడ గ్రామీణం లేదా వాడపల్లి పోలీసు ఠాణాల్లోనే రోడ్డు ప్రమాదం కేసులు నమోదు చేయించేవారు కాబట్టి ఇక్కడ సిబ్బందితో అతడికి లాలూచీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిధిలో ఉన్న పోలీసు అధికారులు, బ్యాంకు సిబ్బంది, వైద్యులు, ఆసుపత్రులపైనా ఏఎస్పీ నర్మద నేతృత్వంలో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.