పాములు ఇంటిలోనికి ప్రవేశించి అనేక ప్రదేశాలలో దర్శనమివ్వడం అనేది తరచుగా జరిగే విషయమే! ఐతే మంచం కింద, స్టోర్ రూం, బాత్‌రూంలలో పాములు కనిపించడం అనేది సాధారణమే కానీ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో మొట్టమొదటిసారిగా ఇన్‌హేలర్ లోపల పాము కనిపించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఒక యువతికి ఆస్తమా ఉండటంతో ఆమె ఇన్‌హేలర్ ఉపయోగిస్తోంది. ఇన్‌హేలర్‌ను వాడి పక్కన పెట్టిన సమయంలో ఎటునుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము పిల్ల వచ్చి ఇన్‌హేలర్‌ లోపలకు దూరింది. పామును యువతి సరైన సమయంలోనే గుర్తించడంతో ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పామును చూసిన వెంటనే యువతి పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి పామును పట్టుకున్నారు. పాము పిల్ల చిన్నదే అయినప్పటికి దాని విషం చాలా ప్రమాదకరమని వారు తెలిపారు. తాము ఇప్పటివరకు ఇళ్లలో అనేక చోట్ల పాములను చూశాం కానీ ఇన్‌హేలర్ లోపల పాము పిల్లను చూడటం ఇదే మొదటిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.