బుధవారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీర్థ్ సింగ్ రావత్ పేరును సూచించింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తీర్థ సింగ్ రావత్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు రావత్ ఆ రాష్ట్ర మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా వ్యవహరించారు. తరువాత 2007లో ఆయన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత 2013లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకత్వ పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత 56 ఏళ్ల రావత్ ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీ తరపున పౌరీ గర్హ్వాల్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించిన తరువాత రావత్ మాట్లాడుతూ.. “నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రధాని మోదీకి, హోం మంత్రి, ఇతర పార్టీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని అన్నారు.