హైదరాబాద్‌ వనస్థలిపురంలో నౌసిన్‌ బేగం అనే మహిళ తన భర్త గగన్ అగర్వాల్ (38)ను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సహారా రోడ్డులోని వివేకానందనగర్‌ కాలనీలో గగన్‌ అగర్వాల్‌ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్‌ గత ఏడాది జులైలో పాతబస్తీకి చెందిన నౌసిన్‌ బేగం(38)ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి గగన్‌ కనిపించకుండా పోయారు. తన అన్న కనిపించకుండా పోవడంపై 8వ తేదీన గగన్‌ సోదరుడు వదినను ప్రశ్నించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎల్బీనగర్‌ పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. అయితే ఫిర్యాదు చేసిన అనంతరం బేగం తన ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లిపోయింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం నౌసిన్‌ను విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించారు. ఫిబ్రవరి 6న గగన్‌ స్నేహితుడు సునీల్‌ సాయంతో భర్తను హత్య చేసి ఇంటి వెనకాల పూడ్చిపెట్టినట్లు అంగీకరించింది. నౌషిన్ ఇచ్చిన సమాచారం ప్రకారం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గగన్‌ మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుడు సునీల్‌ పరారీలో ఉన్నాడు. ఈ హత్యను గూర్చి పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది.