ఈజిప్ట్ సైంటిస్టులు తొలి ప్రయత్నంలోనే ‘అటెన్’ నగరాన్ని గుర్తించి ఆ నగరంలోని కొన్ని అద్భుత ఘట్టాలను వెలికితీయగలిగారు. టుటెంకమిన్ సమాధిని గుర్తించిన తర్వాత అతి ముఖ్యమైన వెలికితీత ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలకు చెందిన ఎంతో మంది పురాతత్వవేత్తలు ఎన్నో తవ్వకాలు చేపట్టినా సాధ్యం కాలేదు. ప్రముఖ చరిత్రకారుడు, పురాతత్వవేత్త జాహీ హవాస్ ఆధ్వర్యంలోని పురాతత్వవేత్తల బృందం ఈ నగరాన్ని గుర్తించి దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. అది 3 వేల ఏళ్ల నాటి ఇసుక కింద సమాధి అయిపోయిన అతి పురాతన నగరం.

విచిత్రం ఏంటంటే.. అన్ని వేల ఏళ్లవుతున్నా ఆ నగరపు గోడలు చెక్కు చెదరని స్థితిలోనే ఉన్నాయి. బేకరీ, సమాధులు, నివాస సముదాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

రాజుల లోయగా పిలిచే లగ్జర్ కు దగ్గర్లో దీనిని గుర్తించినట్టు, ఎమెనోటెప్ 3 కాలానికి చెందినట్టు, ఈజిప్ట్ లో ఇప్పటిదాకా గుర్తించిన పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో ఎన్నో ఆభరణాలు, బీటిల్ పురుగులకు సంబంధించిన ఆనవాళ్లు, మట్టి ఇటుకలు, నివాస సముదాయాల్లోని ఇళ్లలో ప్రజలు నిత్యం వాడే పనిముట్లు, మట్టి పొయ్యిలు, కుండలు, పూలు పెట్టుకునే వాజులు, నాటి మనుషుల అస్థిపంజరాలను గుర్తించారు. టుకలపై ఎమెనోటెప్ 3 చిత్రాలు ముద్రించి ఉన్నట్టు చెప్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్ లో రామ్సెస్ 3, ఎమెనోటెప్ 3కి సంబంధించిన గుళ్ల మధ్య తవ్వకాలు మొదలుపెట్టగా కేవలం వారం వ్యవధిలోనే నగరాన్ని గుర్తించామని చాలా చోట్ల ఇటుకలతో కూడిన నిర్మాణాలు బయటకు కనిపించాయని, తవ్వకాలను మరింత చేపట్టగానే నగరం వెలుగులోకి వచ్చిందని అన్నారు.