పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత పోలింగ్ జరుగుతుందని పాఠకులకు తెలిసిందే! ఉదయం కూచ్‌బెహార్ జిల్లాలో తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ పోలింగ్ మొదలైన తర్వాత కొన్ని ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.
కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపగా తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యపై భాజపా, తృణమూల్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ, మృతుడు తమ పోలింగ్ ఏజెంట్ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని భాజపా వాదులాడుకుంటున్నారు.
కాల్పుల నేపథ్యంలో తృణమూల్, భాజపా మద్దతుదారులు పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగి బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసినప్పటికీ పరిస్థితి సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది భారీగా మోహరించారు.