వార్తలు (News)

గణనాథుడి రూపాలు.. విశిష్టత..!!

ఎలాంటి శుభకార్యమైనా, పండగైనా తొలిపూజ అందుకునేది మాత్రం మన బుల్లి గణపతే! సకల శుభాలకి కారకుడు అయిన ఆ గణేశుడు పుట్టినరోజు కూడా ఇదే! నలుమూలలా సంతోషాల్ని పంచే ఈ ఏకదంతుడు 32 రూపాల్లో భక్తులకి దర్శనమిస్తాడు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన రూపాల విశిష్ఠత ఏమిటో చూద్దామా..!!

వక్రతుండ : ఈ రూపంలో వినాయకుడి తొండం వక్రంగా ఉంటుంది. ఈర్ష్యా, ద్వేషాలను మనసు నుంచి తీసేస్తాడు వక్రతుండ వినాయకుడు.

జయ గణపతి : విజయాల వైపు నడిపించే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. పాశం, విరిగిన దంతం, అంకుశం, పండిన మామిడి పండుతో దర్శనమిస్తాడు.

భక్తి గణపతి : భక్తి గణపతికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతుల్లో కొబ్బరికాయ, బెల్లం పరమాన్నం , ఎడమ వైపు చేతుల్లో మామిడి పండు, అరటిపండు ఉన్న గిన్నె పట్టుకుని దర్శనమిస్తాడు.

తరుణ గణపతి : తరుణ అంటే యవ్వనం. ఈ రూపంలో గణపతికి ఎనిమిది చేతులుంటాయి. అంకుశం, జామపండు, దంతం, చెరుకు గడ , ఉండ్రాళ్ళు​, వెలగపండు గుజ్జు, మొక్కజొన్న కంకి, వల పట్టుకుని కనిపిస్తాడు ఉంటాడు ఈ రూపంలో.

వీర గణపతి : వినాయక రూపాల్లో చాలా శక్తి వంతమైంది వీర గణపతి రూపం. ఈ రూపంలో గణపతికి 16 చేతులుంటాయి. బాణం, బేతాళుడు, చక్రం, మంచపు కోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా, శక్తి, కుంతమనే, ముద్గరం అనే ఆయుధాలు, విల్లు, ఖడ్గం, అంకుశం, పాశం, విరిగిన దంతంతో దర్శనమిస్తాడు.

శక్తి గణపతి : శక్తి గణపతిని పూజిస్తే కష్టం దరిచేరదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపంలో నాలుగు చేతులతో కనిపిస్తాడు గణేశుడు. అంకుశం, పాశం, విరిగిన దంతం చేత పట్టుకుని భక్తుల కోర్కెలు తీర్చుతాడు.

లంబోదర : పెద్ద పొట్టతో ఈ రూపంలో దర్శనమిస్తాడు గణనాథుడు. కోపం, అసూయ, ద్వేషాలని ఈ రూపంలో తరిమేస్తాడు.

గజానన : గజానన అంటే ఏనుగు తల అని అర్ధం. ఈ రూపంలో ఉన్న వినాయకుడ్ని పూజిస్తే తెలివి తేటలు పెరుగుతాయి.

నృత్య గణపతి : మనసుకు ప్రశాంతతని ఇచ్చే ఈ గణపతి చేతులలో పాశం, అప్పాలు, అంకుశం, విరిగిన దంతం ఉంటుంది.

సిద్ధి గణపతి : ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. చేతుల్లో పండిన మామిడి పండు, పూలగుత్తి, గొడ్డలితో దర్శనమిస్తాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •