హైదరాబాద్‌: ‘‘ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగరక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నా..న్యాయశాఖ, ఇతర విభాగాల్లో కొలువులు ఇప్పిస్తా’’ అంటూ ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నందికొండ సంతోష్‌ను పశ్చిమమండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. రెండు నకిలీ ఎస్‌ఐ గుర్తింపు కార్డులు, బొమ్మ పిస్తోలు, మార్ఫింగ్‌ ఫొటోలను స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు తెలిపారు. రేతిబౌలిలో ఉంటున్న సంతోష్‌ కారు డ్రైవర్‌గా వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించేందుకు సీఎం అంగరక్షకుడినంటూ నకిలీ అవతారమెత్తాడు. సీఎంతో ఉన్నట్టు ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, వాటిని చూపించి ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడన్నారు. ఎస్‌ఐగా పనిచేస్తున్నానంటూ యువతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడన్నారు.