ప్రజలు ఏమి కోరుతున్నారో అందించి ప్రజల అజెండాయే తన అజెండాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలన కొనసాగిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి, చెముడులంక, చొప్పెల్ల, బడుగువానిలంక గ్రామాలలో సోమవారం ‘ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. ఎమ్మెల్యే చిర్ల, ఆలమూరు ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర సేవాదళ్ కన్వీనర్ చల్లా ప్రభాకర్రావు తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా చైతన్య పాదయాత్ర కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి చొప్పెల్ల గ్రామం వరకు యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో మమేకం అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలల పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా సేకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ నాయకులు చేయలేని సాహసం మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చేసారని, 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మమేకమయ్యారన్నారు. ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసిన వైఎస్‌ జగన్‌ ప్రజా మేనిఫోస్టోతో ఎన్నికలకు వెళ్లి ఎవరు ఊహించని అఖండ విజయం సాధించారని చెప్పారు. అధికారంలోకి వచ్చి 16 నెలల్లోనే 90 శాతం హామీలు నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, మార్గాన గంగాధర్, డేవిడ్ రాజ్, దొండపాటి చంటి, యెరుబండి నర్సింహమూర్తి, యనమదల నాగేశ్వర్రావు, చెల్లుబోయిన శ్రీనివాస్, అడ్డాల సత్యనారాయణరాజు, ఉండ్రాజవరపు సుందర విజయం, తోరాటి లక్ష్మణరావు, దియ్యన పెద్దకాపు, వైస్సార్సీపీ నియోజకవర్గ నేతలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.