లావాదేవీల నుండి ఇతర అవసరాల వరకు ఆధార్ కార్డును ఇప్పుడు ప్రాథమికంగా ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఆధార్ కార్డులో నమోదు చేసిన మీ వివరాలన్నీ సరైనవి, కాదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాలలో తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలి.

కొన్ని సందర్భాల్లో తప్పులు ఉన్నప్పటికీ వాటిని సులభంగా మార్చవచ్చు. ప్రత్యేకంగా పుట్టిన తేదీని మీరు ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి సమీప ఆధార్ సేవా కేంద్రం, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

ఇలా కాకుండా మీరు మీ పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో కూడా అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకు మీ మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి, అప్పుడే మీరు ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

మీరు మొదట యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తరువాత, ‘మేరా ఆధార్’ విభాగంలో ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్‌లైన్’ పై క్లిక్ చేయండి.

మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, దీనిలో ‘ఆధార్ అప్‌డేట్’ అనే దానిపై క్లిక్ చేయండి. దీని తరువాత, మీరు ఆధార్ నంబర్ ఉన్న విభాగంలో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి, కాప్చా వెరిఫికేషన్ విభాగంలో స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఫిల్ చేయండి.

ఇవన్నీ నింపిన తరువాత, మీరు సెండ్ ఓటిపి పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి 6 అంకెల ఓటిపి కనిపిస్తుంది. ఎంటర్ ఓటిపి విభాగంలో ఓటిపి ఎంటర్ చేయాలి.

ఇప్పుడు మీ స్క్రీన్‌పై అప్‌డేట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, వాటిలో పుట్టిన తేదీ ఆప్షన్ ఎంచుకోవాలి తరువాత సరైన పుట్టిన తేదీని అందులో ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీని రుజువు చేయడానికి, సంబంధిత చెల్లుబాటు అయ్యే పత్రాలు స్క్రీన్ పై కనిపిస్త్గాయి వాటిలో ఒకదాని స్కాన్ కాపీని అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.

మీరు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు: మీరు మీ వివరాలను నింపిన తరువాత, మీ ఆధార్ 20 నుండి 90 రోజుల్లో అప్ డేట్ అవుతుంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ఆధార్ నిబంధనలలో మార్పుల కారణంగా మీరు పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే అప్ డేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువసార్లు వివరాలను అప్ డేట్ చేయాలనుకుంటే సమీప ఆధార్ సేవా కేంద్రంలో సంప్రదించాలి.