ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను యుద్ధప్రాతిపదికన అందించేందుకు తాము ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తో ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఫైజర్..జర్మన్ బయోటెక్ కంపెనీ బయోన్టెక్ తో కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశలో ఉంది. అయితే…తమ మూడో దశ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని, 90 శాతానికిపైగా ప్రభావంతంగా ఫలితాలు చూపిస్తున్నాయని..ఫైజర్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు..వ్యాక్సిన్ పనితీరుపై ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీతో చేయించిన మధ్యంతర విశ్లేషణ నివేదికకు సంబంధించి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు సమాచారం కూడా పంపింది. అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ కు అధికారిక అనుమతి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే..వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రాగానే కువైట్ కు కూడా ప్రధాన్యత ఇస్తూ పది లక్షల డోసులు అందించాలని ప్రభుత్వం ఫైజర్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 7.6 బిలియన్ దినార్లని స్పష్టం చేసింది.