ఏపి లో ఓటిఎస్ పేరుతో కాసుల వేట మొదలయ్యింది. ఓటిఎస్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు పైకం చెల్లించవలసిందే అంటూ అన్ని వైపుల నుండి ప్రభుత్వ పెద్దలు, అధికారులు పేదల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. తాజాగా మర్రిపాడు MPDO పంచాయతీ సెక్రటరీలతో మరియు విఆర్ఓ లకు ఇస్తున్న ఆజ్ఞలు చర్చనీయాంశమయ్యాయి. ఒకపక్క ఓటిఎస్ కట్టడం కట్టకపోవడం అనేది వారి ఇష్టప్రకారం చేయవచ్చని చెప్తూనే సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అసలు మర్రిపాడు MPDO మాట్లాడిన మాటలు ఏంటంటే.. “ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్సులో నాతో చర్చించడం జరిగింది. ప్రతి మండలానికి ఓటిఎస్ మీద రోజుకి 100 టార్గెట్ ఇచ్చారు. యావరేజ్ గా ఒక సచివాలయానికి ఒకరోజుకి 10 తీసుకుంటే మొత్తం 17 సచివాలయాలు కలిపి మండల్ టార్గెట్ పూర్తవుతుంది. ఇవాళ కొంతమంది సెక్రటరీస్ బాగా పని చేసారు. మరికొంత మంది సెక్రటరీస్ అసలు పని చేయలేదు. ముఖ్యంగా చాలా పెద్దగా ఉన్న పడమటినాయుడిపల్లి, సుంచులూరు, రామానాయుడు పల్లి, భీమవరం, బ్ర్హమైన పల్లి, ఇర్లపాడు సచివాలయాలు వాళ్ళు అతి తక్కువగా టార్గెట్ పూర్తి చేసారు. వీరు కష్టపడి రోజుకి కనీసం పది అయినా పూర్తి చేయాలి. ఇంకా ప్రభుత్వ పథకాల వంటివి వారికి చేరకుండా చేస్తామని నయానో, భయానో వారికీ నచ్చచెప్పి అయినా మీ పని పూర్తి చేయాలి.

ముఖ్యంగా సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులచేత ముందుగా ఈ ఓటిఎస్ కట్టించాలి అని, వారిమీద మనం ఒత్తిడి తీసుకువస్తే మిగిలినవారిచేత వారే కట్టిస్తారని, ముఖ్యంగా డిసిపల్లి, మర్రిపాడు లాంటి ప్రదేశాలలో భూమి ఖరీదు ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు సునాయాసంగా భూమి సొంతం చేసుకుంటారు, అలాంటి ప్రదేశాలలో ఉన్న సచివాలయాల టార్గెట్ 20 ఇస్తున్నాము. ముఖ్యంగా ఓసి లు, బిసి లు ఎవరైతే ఉన్నారో వారిని ఒత్తిడి చేయండి. వీరు పూర్తిగా కట్టిన తర్వాత ఎస్ సి లు, ఎస్ టి ల ను ఆఖర్లో ఒత్తిడి చేయవచ్చు.

రేపు పొద్దున్న నుండి మన ఆఫీస్ నుండి మీకు గంట, గంటకి రిపోర్ట్ లు పెట్టడమే కాదు, ఫోన్ లు కూడా చేస్తూ ఉంటాము.. కాబట్టి వి ఆర్ ఓ లు, డిజిటల్ అసిస్టెంట్ లు ఎవరైతే ఉన్నారో వారు మీ కార్యాలయానికి ఏదయినా పని మీద వచ్చిన వారిలో ఈ ఓటిఎస్ ఎవరు అయితే కట్టకుండా ఉన్నారో వారి పని మీరు పూర్తి చేయకండి, వారికి చేయవలసిన పనిని పక్కకి పెట్టేయండి, పొంగూరు పంచాయతీలో బిసి కాలనీ లో అయితే 5000 రూపాయలు, 6000 రూపాయలు కడితే చాలు చాలామందికి ఇల్లు వచ్చే అవకాశం ఉంది అలాంటి వారితో ముందు డబ్బుకట్టించండి, పంచాయతీ సెక్రటరీ లు ఇళ్లల్లో ఉండి మాట్లాడితే కుదరదు ఇల్లు, ఇల్లు తిరిగి మరీ ప్రచారం చేసి ప్రజలను ఒప్పించండి” అని మర్రిపాడు MPDO చెప్పారు. మరి ఓ టి ఎస్ అన్నది బలవంతం బ్రాహ్మణార్థమో.. వారి ఇష్టప్రకారం చేసే పనో మీరే తేల్చుకోండి.. మీ కోసం ఆడియో క్లిప్ లింక్ కూడా పెడుతున్నాము.. వారి దౌర్దన్యం మీరే వారి మాటల్లో వినండి..