రైల్వే శాఖ ప్రయాణికులపై ప్రత్యేక చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా అభివృద్ధి చేసిన స్టేషన్లలో స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు పేరుతో ప్రత్యేక చార్జీలు వసూలు చేయనుంది. దీనిని నిర్ధారిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. బుకింగ్‌ సమయంలోనే టికెట్‌తోపాటు . రూ.10 నుంచి రూ.50 మేరచార్జీలు వసూలు చేయనున్నారు.

స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు కింద మొత్తం మూడు కేటగిరీల్లో ఈ ఫీజును వసూలు చేయనున్నారు. ఏసీకైతే రూ.50, స్లీపర్‌ క్లాస్‌కైతే రూ.25, అన్‌ రిజర్వ్‌డ్‌ క్లాస్‌కైతే రూ.10 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్‌ రైళ్లకు దీన్నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రైల్వే బోర్డు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. ఇంకా ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర కూడా రూ.10 మేర పెరగనుంది.

”అభివృద్ధి చేసిన/ పునరాభివృద్ధి చేసిన స్టేషన్లలో ‘స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు’ను తరగతిని బట్టి వసూలు చేయాలి. ఒకవేళ ఆ స్టేషన్‌లో ప్రయాణికుడు దిగినట్లయితే నిర్దేశించిన ఫీజు మొత్తంలో 50 శాతం భారం పడుతుంది. ఒకవేళ రైలు ఎక్కే స్టేషన్‌, దిగే స్టేషన్‌ రెండూ కూడా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లయితే నిర్దేశించిన దానికంటే 1.5 రెట్లు భారం అధికంగా ఉంటుంది” అని రైల్వే బోర్డు సర్క్యులర్‌లో తెలిపింది.

ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రాణి కమలాపాటి స్టేషన్‌, పశ్చిమ రైల్వే పరిధిలోని గాంధీనగర్‌ కేపిటల్‌ స్టేషన్‌ అభివృద్ధి పూర్తవ్వడంతో పాటు అందుబాటులోకి కూడా వచ్చాయి. కాగా, స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు వల్ల రైల్వే ఆదాయం పెరగడంతో పాటు, ప్రైవేటు వ్యక్తులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు సంజాయిషీ ఇస్తున్నప్పటికీ ఆచరణలో ఎలా ఉంటుందనేది ఆలోచించదగ్గ అంశమే!