తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో కేసులు పెరిగిన సమయంలో ఆస్పత్రులకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం డాక్టర్లు, నర్సుల సెలవులు రద్దు చేసింది. మరోవైపు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వాలంటూ త్వరలో ఆదేశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8 నుంచి సెలవులు కావడంతో స్కూళ్లలోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.