కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియదు. పరీక్షలన్నీ సమయానికి జరగడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ ఏడాది అలా జరగకుండా చూడాలని అధికారులు పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఉన్నత విద్యామండలి చర్యలు ప్రారంభిస్తూ వివిధ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించింది. ఎంసెట్ కన్వీనర్ గా గోవర్ధన్, ఈసెట్ కన్వీనర్ గా విజయ్ కుమార్ రెడ్డి, ఐసెట్ కన్వీనర్ గా రాజిరెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ గా పీ లక్ష్మీనారాయణ, ఎడ్ సెట్ కన్వీనర్ గా రామకృష్ణ, లాసెట్ కన్వీనర్ గా జీబీ రెడ్డిని నియమించింది ఉన్నత విద్యామండలి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శుక్రవారం వివరాలను వెల్లడించారు.

ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై సైతం ఉన్నత విద్యామండలి జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో ఆయా పరీక్షల నిర్వహణను ప్రారంభించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఒక వేళ కేసులు ఉధృతమైనా కూడా ఫిబ్రవరి చివరి వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కరోనా ప్రభావం ఆధారంగా ఎగ్జామ్ తేదీలు మారే అవకాశం ఉంటుంది. గతేడాది సైతం జూన్ నెలాఖరులో పరీక్షలను ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి భావించింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు నుంచి ఆయా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను ప్రారంభించాల్సి వచ్చింది.