కరోనా చాప కింద నీరులా నెమ్మదిగా మళ్లీ విజృంభించడానికి సిద్ధమవుతోంది. దేశంలో కరోనా కేసులు లక్ష మార్కును దాటేశాయి. డెల్టా వేరియంట్‌కు, ఒమిక్రాన్‌ తోడవడంతో కేసుల విపరీతంగా పెరిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక మరికొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని చెబుతూనే మరోవైపు ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నై రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

చెన్నైలోని లోకల్‌ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందేనని కండిషన్ పెట్టారు. రెండో టీకా వేయించుకున్నట్టు సర్టిఫికెట్‌ ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 10 నుంచి 31 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సదరన్‌ రైల్వే ప్రకటించింది.

వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేని వారికి రైళ్లలోకి అనుమతి ఉండదని, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తేల్చి చెప్పారు. ఈ నిబంధనలో ఎవరికీ మినహాయింపు లేదని, మొబైల్‌ ఫోన్‌లో యూటీఎస్‌ ద్వారా టికెట్‌ పొందే అవకాశాన్ని తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వివరించారు.