తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు వేగంగా పావులు కదుపుతున్న వైఎస్ షర్మిలతో ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ లోటస్‌పాండ్‌కి వచ్చిన ఆయన షర్మిలతో సుమారు పావుగంట పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనీల్‌తో ఆయన సుమారు గంట పాటు భేటీ అయ్యారు.
జగన్ ఇష్టానికి వ్యతిరేకంగా షర్మిల పార్టీని స్థాపిస్తున్నారని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్, షర్మిల మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఇవి విభేదాలు కాదని, బేదాభిప్రాయాలని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే, ఒకవైపు పార్టీ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్న షర్మిలను ఆర్కే ఎందుకు కలిశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వైఎస్ కుటుంబానికి ఆర్కె సన్నిహితుడు. ఆయన మంగళగిరిలో పోటీ చేసినప్పుడు షర్మిల ఈ నియోజకవర్గ బాధ్యతలను తీసుకొని ప్రచారం చేసి ఆర్కెను గెలిపించారు. షర్మిలతో ఉన్న పరిచయం దృష్ట్యా ఆమెతో ఆర్కె భేటీ అయ్యి అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్నారా లేదా జగన్ దూతగా షర్మిల పార్టీ స్థాపించకుండా చివరి ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఒక నేషనల్ మీడియా ఛానెల్‌తో షర్మిల మాట్లాడుతూ… తాను జగన్‌కు మద్దతు ఇచ్చానని, జగన్ మద్దతు కూడా తనకు ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.