బ్రెజిల్‌ దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కోవిడ్-19 తో చనిపోయిన మృతుల సంఖ్య మొట్టమొదటి సారిగా 2,000 దాటింది. .

కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానం బ్రెజిల్ దే. ఇప్పటివరకూ ఈ దేశంలో 2,68,370 మంది చనిపోయారు. బుధవారం ఒక్క రోజులో 2,286 మంది కన్నుమూశారు. కరోనా మ్యుటేషన్ల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి సోకటం మరింతగా విషమించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నపుడు దేశాధ్యక్షుడు జేయిర్ బొల్సొనారో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మాజీ అధ్యక్షుడు లూయీజ్ ఇనాసియో లులా డి సిల్వా బుధవారం ధ్వజమెత్తారు. ఈ నెల రోజుల కాలంలో బొల్సొనారో బుధవారం తొలిసారి ఫేస్ మాస్క్ ధరించి కనిపించారు. ఈ వైరస్ వల్ల వాటిల్లే ముప్పును తేలికగా కొట్టివేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటంతో బ్రెజిల్‌లోని పెద్ద నగరాల్లో ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. చాలా ఆస్పత్రులు కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయని దేశంలో ప్రధాన ప్రజారోగ్య కేంద్రం ఫియోక్రజ్ హెచ్చరించింది.

బుధవారం నాడు దేశ వ్యాప్తంగా మొత్తం 79,876 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ బ్రెజిల్‌లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్యలో ఇది మూడో స్థానంలో నిలిచింది.

పీ1 అని పేరు పెట్టిన కొత్త కరోనావైరస్ రకం వ్యాప్తి వల్ల దేశంలో కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఈ కరోనావైరస్ రకం మానాస్ అనే అమెజాన్ నగరంలో పుట్టినట్లు భావిస్తున్నారు.