శివరాత్రి అనేది హిందువులకి అత్యంత పవిత్రమైన పండగ. శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెపుతుంది. ఈ రోజున భక్తులు తెల్లవారు జామున లేచి, స్నానం చేసి అత్యంత భక్తీ శ్రద్దలతో శివుడిని కొలుస్తారు. ప్రధానంగా ఈ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేసారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. సంవత్సర కాలంలో 12 శివరాత్రులు వస్తాయి. వాటన్నిటిలో మహాశివరాత్రి అన్నది అత్యంత పవిత్రమైనది. అన్ని శైవక్షేత్రాలలో మహాశివరాత్రి వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయి.

ప్రతి పండగ వెనుక ఏదోక రహస్యం ఉన్నట్టుగా మహాశివరాత్రి వెనుక కూడా చాలా కథలున్నాయి. శివపురాణం నుండి తీసుకోబడిన ఒక కథను మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఒకప్పుడు ప్రళయ కాలం సంభవించి బ్రహ్మ, విష్ణువులు ఒకరి కంటే ఒకరం గొప్ప అని ఇద్దరూ ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలో వారి మధ్య లింగ స్వరూపం అగ్నిస్థంబంగా ఆవిర్భవించింది. అగ్నిస్థంబం అయితే కనిపిస్తుంది కానీ ఆ అగ్నిస్థంబం మొదలు, చివర ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండా పోయింది.

అగ్నిస్థంబం మొదలు లేదా చివరను ఎవరైతే తెలుసుకొని చెబుతారో వారే గొప్ప అని ఆ లింగ స్వరూపం చెప్పడంతో వెంటనే విష్ణువు తన పది అవతారాలలో ఒకటైన వరాహావతారంలో కిందున్న పాతాళలోకంలోకి వెళ్తారు. ఇక బ్రహ్మ హంస వాహనంతో ఆకాశం వైపు వెళ్ళారు. ఎంత వెళ్ళినా విష్ణువుకి మొదలు దొరకకపోవడంతో తిరిగివచ్చేశారు. ఇక బ్రహ్మ మాత్రం తాను అంతం చూశానని దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతారు. దీంతో జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై, మోసము చేసిన బ్రహ్మను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతారు.

విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తారు. ఇక కామధేనువు, మొగిలిపువ్వు చెప్పిన అబద్దం వల్ల బ్రహ్మపై ఆగ్రహం వ్యక్తం చేసి, మొగిలిపువ్వును పూజకు అర్హతలేనిదిగా శపించగా, తెల్లవారి లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప కారణం అని శపించారు. ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది, తోక భాగాన్ని పూజించిన వారికీ పుణ్య ఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించారు. ఆనాటి అర్ధరాత్రిని లింగోద్భవకాలంగా భావించి, మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.