ఏపీ ప్రభుత్వం రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌ (ఆర్డీసీ) ద్వారా రాష్ట్రంలోని రహదారుల మరమ్మతుల నిధుల కేటాయింపునకు అనుమతించింది. నిధుల కోసం పెట్రోల్‌, డీజిల్‌పై విధించే సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించనుంది. దాని ద్వారా బ్యాంకుల నుంచి ఆర్డీసీ రుణం తీసుకుని, అనంతరం ఆ నిధులతో రహదారులు, భవనాల శాఖ రోడ్ల మరమ్మతులు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,969కి.మీ మేర మరమ్మతులు పూర్తి చేసేందుకు రూ.2,205 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రహదారులు మొత్తం 5,243 కి.మీ కు, రాష్ట్ర రహదారులు మొత్తం 2,726కి.మీ కు మరమ్మతులు చేపట్టి రహదారులు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దే ఆలోచనలో ఉంది.