ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకే కాకుండా దేశం మొత్తం తెలుసు! ఉక్కు ఉద్యోగుల ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతోంది. తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. ఆ నోటీసు లో సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందానిని రద్దు చేసి, పోస్కోతో జరిగిన ఒప్పందం కూడా రద్దు చేసి, ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగే అవకాశం ఉందని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ ఆ నోటీసు లో స్పష్టం చేసింది. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి చేసిన ప్రకటనతో విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు, అమ్మేదెవరు… కొనేదెవరు..అంటూ ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారుల నిరసనలు మరింత ఉద్ధృతమైన విషయం తెలిసిందే. ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం స్టీలుప్లాంటు పరిపాలన భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు. ఈ క్రమంలో స్టీలుప్లాంటు డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వేణుగోపాలరావు వస్తే, ఆయన కారును సుమారు ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్‌ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే ఆపేశారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని కార్మిక సంఘాలు విన్నవిస్తున్నాయి.