విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామే కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు సుబ్రహ్మణ్యస్వామి. ప్రతీదాన్నీ ప్రైవేటీకరించడం మంచిది కాదని, బలమైన కారణాలుంటేనే అలా చేయాలనీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఆంధ్రప్రదేశ్ వచ్చిన బీజేపీ నేత పలు అంశాలపై స్పందించారు. తిరుమల ఆలయంపై గత కొంత కాలంగా అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. టీటీడీ అకౌంట్లను కాగ్ తో ఆడిటింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలని, టీటీడీపై ప్రభుత్వానికి టీటీడీని అజమాయిషీ లేకుండా చేయాలని, భక్తులే నడిపించే చర్యలు తీసుకోవాలనీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

అమరావతిలో సీఎం జగన్ తో సమావేశమైన అనంతరం పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణను సైతం తప్పుబట్టారు. పెట్రోల్ ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందన్నారు. కాగా, బీజేపీ ఎంపీనే స్వయంగా సొంత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.