మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట గురువారం ఉదయం రాజీవ్ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. సీఐ సంతోషం తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నుంచి కీసర వైపు వెళ్తున్న ఇటుకల లోడు లారీ, అదేమార్గంలో ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొట్టగా ఇటుకల లారీ డీజిల్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి.
కంటైనర్ వాహనం భోపాల్ నుంచి తమిళనాడులోని సేలంకు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు వాహనాల మధ్యలో నిలబడి డ్రైవర్లకు సూచనలు ఇస్తూ ఉన్న కంటైనర్ వాహనం సూపర్వైజర్ ముఖేశ్(38) మంటల్లో సజీవదహనమయ్యారు. మరొక వ్యక్తి జితేందర్ కు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన జితేందర్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.