అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

మరోసారి బైటపడ్డ చైనా కుయుక్తులు!!

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా తమ సైన్యాలను క్రమంగా వెనక్కి తీసుకుంటున్నాయన్న సంగతి పాఠకులకు విదితమే! అయితే ఒక వైపు
తన సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నట్టు నటిస్తున్న చైనా మరోవైపు తన బుద్ది చూపిస్తుంది. గల్వాన్‌, పాంగాంగ్‌ సరస్సు ఇరు తీరాలు, గోగ్రా ప్రాంతాలను చైనా సైన్యం ఖాళీ చేసినట్టు పైకి చూపిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రాంతాల్లోకి తమ అధునాతన ఆయుధాలను తరలిస్తోంది. ఇటీవల అధునాతన మోర్టార్లు సహా సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఛేదించే రాకెట్లను ప్రయోగించగల పీహెచ్ఎల్-03 రాకెట్‌ లాంచర్లను అక్కడికి చేరవేయడంతో డ్రాగన్‌ కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి.

గతంలో కూడా వాస్తవాధీన రేఖ వద్దకు తేలికపాటి టైప్‌-15 యుద్ధ ట్యాంకులను తరలించి, పాంగాంగ్‌ ప్రాంతంలో సుమారు వందకు పైగా జెడ్‌టీజెడ్‌-99, జెడ్‌టీజెడ్‌-88 యుద్ధ ట్యాంకులను నిలిపింది. గతేడాది మాదిరిగానే పీసీఎల్‌-181 మోడల్‌ 155ఎమ్‌ఎమ్‌ హోవిట్జర్‌లను కూడా ఆ ప్రాంతాలకు తరలించింది. అక్కడ జెడ్-8 రకం హెలికాప్టర్లు, భారీగా నిఘా పరికరాలు ఉన్నట్టు సమాచారం.

భారత్‌, చైనాల మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను చల్లార్చాలని ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖలు సహా, సైనికాధికారుల మధ్య 12 విడతలుగా చర్చలు జరుగగా హాట్‌ స్ప్రింగ్స్‌, దెస్పాంగ్‌ ప్రాంతాల్లో మాత్రం బలగాల ఉపసంహరణకు చైనా మొండికేస్తోంది.

లద్దాఖ్‌ తో సహా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమీపంలోని వివాదాస్పద షింకియాంగ్‌ ప్రాంతంలోనూ పీహెచ్ఎల్-03 రాకెట్‌ లాంచర్లను చైనా మోహరించడంతో పాటు బలగాలను వేగంగా తరలించేందుకు వీలుగా 89ఏ మోడల్‌ సాయుధ వాహనాలు, జెడ్‌-11 హెలికాప్టర్లు, అధునాతన పదాతిదళ పోరాట వాహనాలను అక్కడికి చేరవేసినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •