రాజకీయం (Politics) వార్తలు (News)

పరీక్ష పాసైతేనే పర్మినెంట్.. లేదంటే??

రెండేళ్ల క్రితం పరీక్షలు పెట్టి నియమించుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మళ్లీ పరీక్షలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాయడానికి షెడ్యూల్ విడుదల చేసింది.

రెండేళ్ల కిందట రూ. పదిహేను వేల జీతానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీల కింద ఉద్యోగుల్ని తీసుకున్నారు. వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని ప్రొబేషన్‌లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది కానీ మళ్లీ పరీక్షలు పెడతామని అప్పట్లో చెప్పలేదు. కానీ ఇప్పుడు తాము పెట్టే పరీక్షల్లో పాసవ్వాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. వంద మార్కులకు పెట్టబోయే పరీక్షలో కనీసం నలభై మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే ప్రొబేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించారు.

నెలాఖరులో మూడు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ప్రస్తుతానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా ముఫ్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని ఇప్పటి వరకూ ప్రభుత్వం తాము కల్పించిన పర్మినెంట్ ఉద్యోగాల కేటగిరిలో వేసి లెక్కలు చెబుతూ వస్తోంది. అయితే వారు ఇంకా ప్రొబేషన్‌లోకి రాలేదు. ఇప్పుడు రావాలంటే పరీక్షలు రాయక తప్పని పరిస్థితి. ఎంత లేదన్నా వందకు వంద శాతం పరీక్షలు పాసయ్యే పరిస్థితి లేదు కాబట్టి వారిలో సగం మందికి మాత్రమే ఇప్పుడు ప్రొబేషన్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

పరీక్షలు పూర్తయిన తర్వాత కనీసం ఓ లక్ష మందికి ప్రొబేషన్ ఇచ్చినా ఆ మేరకు ప్రభుత్వం పై పెద్ద ఎత్తున భారం పడుతుంది. వారికి స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒక్క సారిగా లక్ష మందికి ప్రొబేషన్ ఇవ్వాలంటే అది మరిన్ని ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం పరీక్షలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •