జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

గత ఏడాది నీట్-2021 టాపర్ చెప్తున్న టిప్స్!!

కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్తబ్దత నెలకొన్న నీట్ పరీక్షకు సర్వం సిద్ధం కావడంతో గత ఏడాది నీట్ పరీక్ష టాపర్ అయిన్ ఆకాంక్ష సింగ్ అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని కుషీనగర్‌కు చెందిన 18 ఏళ్ల ఆకాంక్ష సింగ్ గత ఏడాది మెడికల్ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలవడమే కాకుండా 720కి 720 మార్కులు సాధించి వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో తన సత్తా చాటుకుంది. యూపీలోని పూర్వాంచల్ నుంచి మెడికల్ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచిన మొదటి యువతి కూడా ఆమె కావడం ఇక్కడ విశేషం!

పూర్తి మార్కులు సాధించినప్పటికీ, టై- బ్రేకింగ్ పాలసీ ప్రకారం ఆమె ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆకాంక్ష ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్ చదువుతోంది. ఈ ఏడాది నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆమె పలు సలహాలు ఇచ్చింది.

2021 బ్యాచ్ మాదిరిగానే గత సంవత్సరం కూడా మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై గందరగోళం నెలకొంది కాబట్టి బయటి పరిస్థితులతో ప్రభావితం కాకుండా ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని, పరీక్ష తేదీ వాయిదా పడటంతో, ఆ సమయాన్ని సబ్జెక్టుల రివిజన్‌కు కేటాయించానని, బయట వాతావరణంతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకున్నానని, పరీక్షకు హాజరయ్యేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని ఆకాంక్ష వివరించింది.

చివరి దశలో ప్రిపరేషన్, రివిజన్ కోసం ఒక టైమ్‌టేబుల్ సిద్ధం చేసుకోవడం మంచిదని, చివర్లో అన్ని చాప్టర్లపై సమానంగా దృష్టి పెట్టాలని, కాన్సెప్ట్స్‌ను బాగా అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాలని, ఈ సమయంలో వివిధ రకాల కొత్త పుస్తకాలు చదివి గందరగోళానికి గురికాకుండా బేసిక్ సిలబస్‌ ముందుగా పూర్తి చేసి, ఎక్కువ మార్కులు పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

మాక్ టెస్ట్‌లపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ఆకాంక్ష చెబుతోంది. ఇందులో తప్పులను సరిచేసుకుంటూ, నేర్చుకున్న కాన్సెప్ట్స్‌ను రివిజన్ చేసుకోవాలని, చివరి దశలో శాంపిల్ క్వశ్చన్స్, చర్చలు, అధ్యాపకుల సూచనలు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. ఫిజిక్స్ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెబుతోంది ఆకాంక్ష. దీని నుంచి ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయని, బాగా సిద్ధమైతే పరీక్షలో మంచి మార్కులతో పాటు వెయిటేజీ సైతం పొందవచ్చని, తనకు జీవశాస్త్రం కఠినమైన సబ్జెక్టుగా ఉండేదని ఆకాంక్ష వివరించింది.

ప్రాక్టీస్ విషయంలో మాత్రమే కాకుండా పరీక్ష రాసే సమయంలో కూడా ఒక వ్యూహం ఉండాలని ఆకాంక్ష చెబుతోంది. ఈ సంవత్సరం ప్రశ్నల సంఖ్య పెరిగింది. కానీ కేటాయించిన సమయం మాత్రం అలాగే ఉంది. అందువల్ల పరీక్షలో ముందు సరళమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలని, ఆ తర్వాత కష్టమైన లేదా థియరీ బేస్డ్ ప్రశ్నలు చూడాలని చెప్పింది. విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్ట్‌ విభాగాన్ని ముందుగా ఎంచుకోవాలని చెబుతోంది. పరీక్ష పూర్తిచేసిన తరువాత రివిజన్ కోసం కనీసం 30-40 నిమిషాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తోంది.

పరీక్షను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి మాక్ టెస్టుల ద్వారా ప్రాక్టీస్ చేయాలని ఆకాంక్ష చెబుతోంది. తాను మాక్ టెస్టుల ద్వారా రెండు గంటల్లోనే పరీక్ష పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నానని, టైమ్ మేనేజ్‌మెంట్ కోసం అభ్యర్థులు ఇలా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తోంది. టైమ్‌టేబుల్, స్మార్ట్‌వర్క్, ప్రిపరేషన్‌కు బౌండరీస్ తెలుసుకోవడం ఇప్పుడు అభ్యర్థులు ఈ మూడు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఆకాంక్ష సూచించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •